కరోనా తెచ్చిన మార్పులు గమనించారా | corona changes in indian culture


జీవితంలో లాక్‌డౌన్‌ తెచ్చిన మార్పులు గమనించారా?
ఇన్నాళ్లూ పగలూ రాత్రి... ఆఫీసు, వ్యాపారం, చదువులంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవాళ్లు. లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులంతా కలసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి భోజనం చేయాలని ఇంట్లో తల్లి, భార్య ఎంతకాలం నుంచి ఎదురుచూస్తున్నారో.. ఇప్పటికి వారి కల నెరవేరిందనే చెప్పాలి.


ఉద్యోగాలతో తల్లిదండ్రులు.. చదువులతో పిల్లలు తీరక లేకుండా గడిపేవాళ్లు. ఇప్పుడు బోలెడంతా ఖాళీ సమయం దొరికింది. పిల్లలతో తల్లిదండ్రులు సరదాగా ముచ్చటిస్తున్నారు. చదువు, భవిష్యత్తు, స్నేహితులు వ్యక్తిగత విషయాలు ఇలా అన్ని తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం పిల్లలకు లభించింది.

ఇంట్లో ఆడవాళ్లు.. భోజనం చేసి వెళ్లమంటే చాలా మంది బయట తింటాంలే అనే వాళ్లు. ఇప్పుడా అవకాశమే లేదు. లాక్ డౌన్ తో రెస్టారెంట్లు, బేకరీలు అన్ని మూసేశారు. పిజ్జాలు, బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేవారికి ఇప్పుడు ఇంటి భోజనం రుచి తెలిసొస్తోంది. ఇంట్లో వండే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇకపై జంక్ ఫుడ్ మానేసి ఇంటి భోజనం తినడం అలవాటు చేసుకోండి.

టెక్నాలజీ యుగంలో ఖాళీ సమయం దొరికితే చిన్న పెద్దా తేడా లేకుండా మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. లాక్ డౌన్ లో రోజంతా ఆన్ లైన్ లో ఆడాలంటే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఇప్పుడంతా చిన్నప్పుడు ఆడుకున్న ఆటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో వాళ్లతో క్యారెమ్స్ , అష్టాచమ్మా, హౌసీ వంటి ఆటలు ఆడుతున్నారు. ఇలా కుటుంబ సభ్యులతో ఆడుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకురాకుండా ఉంటాయా.

చిన్నప్పుడు మీరో, మీ పెద్దలో చూసిన ఒకే ఒక ఛానెల్ దూరదర్శన్ . అందులో ప్రసారమైన రామాయణ్ , మహాభారత్ , శక్తిమాన్ సీరియల్స్ ఇప్పటికీ చాలామంది మనస్సుల్లో ఉండిపోయాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సీరియల్స్ ను పునఃప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూస్తూ చిన్నతనం గుర్తుకు తెచ్చుకోవడమే కాదు.. నేటి తరానికి ఇతిహాసాల గురించి తెలిపే అవకాశం వచ్చింది.

ఆఫీస్ ఒత్తిళ్లు లేవు.. ఇతరులతో గొడవలు, వివాదాలు లేవు. ఎవరికి వారు ఇంట్లో కుటుంబసభ్యులతో ప్రశాంతంగా ఉంటున్నారు. దీంతో చాలా మందికి కోపం కూడా తగ్గే ఉంటుంది. కుటుంబ సభ్యులపై పెద్దగా కోప్పడలేం కాబట్టి.. ఎదుటివాళ్లు చెప్పే విషయాలను అర్థం చేసుకునే వీలు కలిగింది. కుటుంబం కోసమే తామున్నది.. రాబోయే రోజుల్లో వారిని కష్టపెట్టకుండా ఎలా చూసుకోవాలన్నదే ఇప్పుడు ఇంటి పెద్దలకున్న ఆలోచన.

మగవారికి విధుల నుంచి విశ్రాంతి దొరికినా.. మహిళలకు మాత్రం ఇంట్లో పని మరింత పెరిగింది. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగవాళ్లు సాయంగా నిలుస్తున్నారు. కలిసి ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు.


వీకెండ్ వస్తే చాలు.. పబ్ లు పార్టీలంటూ తిరిగే యువత ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో చేసే పసందైన వంటకాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ఇంటినే పబ్ గా మార్చేసి... కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడుపుతున్నారు.

ప్రతిరోజు సిగరెట్ తాగేవాళ్లు.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు సిగరెట్ తాగే వాళ్లకి ఇది కష్టకాలమే. లాక్ డౌన్ తో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయలేని స్థితిలో సిగరెట్ తాగే అలవాటు తగ్గిపోయి ఉంటుంది.

ఇదివరకు పెంపుడు జంతువులను ఉదయం, సాయంత్రం వాకింగ్ తీసుకెళ్లడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు వాటితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. జంతువులను అర్థం చేసుకోవడానికి, వాటి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఈ లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగిస్తున్నారు.

లాక్ డౌన్ వల్ల వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రావట్లేదు. ఫ్యాక్టరీలు మూత పడటంతో గాలిలో కాలుష్యం తగ్గింది. నీలాకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇల్లు దాటి బయటకు రాలేకున్నా.. ఇంటి బాల్కనీలోనో.. ఇంటి ముందో కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు.

ఫోన్ లోనూ నిత్యం సహోద్యుగులు, ఉన్నతాధికారులతో మాట్లాడే మీకు ఇప్పుడు విరామం లభించింది. అందుకే చాలామంది తమ చిన్ననాటి స్నేహితులు, బంధువులను ఫోన్ లో పలకరిస్తున్నారు. యోగక్షేమాలు వాకబు చేస్తూ పిచ్చాపాటిగా మాట్లాడి నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు.

ఉదయం లేచి పరుగు పరుగున ఆఫీస్ కి వెళ్లడం.. ఏ రాత్రో ఇంటికి రావడం.. ఇన్నాళ్లు ఇలాగే సాగిపోయింది. ఇప్పుడు చాలా తీరిక ఉంది. కాబట్టి శరీర ధారుఢ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. మానవ సైకాలజీ ప్రకారం ఏదైనా 21 రోజులు చేస్తే అది మనకు అలవాటైపోతుందట. కాబట్టి ఈ లాక్ డౌన్ లో ఇప్పటికే యోగా, వ్యాయమం మొదలు పెట్టినవాళ్లు దానిని కొనసాగిస్తే సరి.

సంగీతం నేర్చుకోవాలనో.. పెయింటింగ్స్ వేయాలనో చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని ఈ లాక్ డౌన్ సమయంలో తీర్చుకుంటున్నారు. ఆన్ లైన్ కోర్సులు ద్వారా కొత్త కొత్త అంశాలపై పట్టు సాధిస్తున్నారు. చాలా మంది మహిళలు యూట్యూబ్ లో చూసి కొత్త రకం వంటలు చేస్తున్నారట.

ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మన గురించి మనం ఆలోచించుకునే సమయం లభించింది. నాలోని ప్రతికూలతలు ఏంటి? ప్రతిభ ఏంటి? ఎలా ప్రవర్తిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు, లక్ష్య చేధన మార్గాలు ఇలా అన్ని అంశాలపై పరిశీలన.. ఆత్మపరిశీలన చేసుకుటున్నారు.
Related Postes:
కరోనాతో నష్టపోయారా...అయితే ఇలా చేయండి రూ. 10 లక్షల కోసం
> ఆధ్యాత్మిక పుస్తకాలూ అన్ని ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేస్కోండి
సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ మీకు కావాలి అంటే ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి 
ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి
corona, corona virus, corona news, lockdown, coronavirus indai, lockdown changes,

Comments