భక్తుడి కోరికతో చెట్టులోనే వెలసిన హనుమ - Sri Maddi Anjaneya Swamy Temple History Telugu

భక్తుడి కోరికతో చెట్టులోనే వెలసిన హనుమ..

లంకలో ఉన్నవాళ్లందరూ రాక్షసులు కాదు. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషుణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవ హింస చేయననేవాడు.

దీంతో రావణుడు అతడిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుడి చెంతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికీ హితబోధ చేసేవాడు. సీత జాడ వెదుక్కొంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వీరభక్తుడిగా మారిపోయాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు. రామరావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గోవాలని మధ్వాసురుడుకి పిలుపొచ్చింది. దీంతో ఏంచేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి, హనుమంతుడి నామాన్ని ఉచ్చిరిస్తూ ఆత్మత్యాగం చేశాడు.

ద్వాపర యుగంలోనూ మళ్లీ మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు దుర‌దృష్టవశాత్తు కౌరవుల తరఫున పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు. ఒకరోజు పక్కన ఉన్న కాల్వలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి, తినడానికి మామిడి పండు ఇచ్చింది. అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి.... నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమని మద్యుడు అడిగాడు.

దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు ధర్శనం ఇచ్చాడు. దీనికి పులకించిన మద్యుడు స్వామీ నిన్ను ఒకే ఒక్కటి కోరతాను... దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుమన్నాడు. మద్యుడు స్వామీ నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు. దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు.

అలా వెలసిన దేవాలయమే మద్ది ఆంజనేయస్వామి ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని ఆంజనేయుడు ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు.

Famous Posts:

Tags : maddi anjaneya swamy images, maddi anjaneya swamy temple phone number, maddi anjaneya swamy temple wikipedia in telugu, maddi anjaneya swamy temple history in telugu, sri maddi anjaneya swamy temple timings, dwaraka tirumala to maddi anjaneya swamy temple, vijayawada to maddi anjaneya swamy temple, anjaneya swamy, హనుమ

Comments