మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం - Telugu Devotional Stories - Hindu Temple Guide

మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం

ధనము ఉన్నదని.. అనుచరణ గణము ఉన్నదని.. యౌవనం ఉన్నదని గర్వించే మానవ జన్మకు ఉపనిషత్తులు తెలిపిన చిన్న సూచన...

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు..

ధన జన యౌవన గర్వం...!!!

కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...

వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు..

అంతా డబ్బే, డబ్బున్నవారు మాత్రమే మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు...

ఎవరిని ఏ మోసం చేసి, ఏమి మాయమాటలు చెప్పి ఎలా డబ్భు, ధనం లాగాలనే నిత్య స్మరణ లో వుంటారు..

కొందరికి జనగర్వం...!!!

తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు,

అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు, 

( సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు... )

తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు...

కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది.

తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో అప్పుడు తెలుస్తుంది...

ఇక కొందరికి యౌవన గర్వం...!!!

యవ్వనం శాశ్వతం అనుకుంటారు, శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం..

ఆ గర్వంలో అతడు/ఆమె మంచి చెడూ, గమనించరు...

కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, అహంభావంతో ఉంటారు, ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు..

హరతి నిమేషాత్కాలః సర్వం...!!!

ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు...

ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి...

నాకేం.. కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది...

ఇప్పుడు ఏమైంది ఆ గర్వం.. నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు, వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది..

కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు. అంటే అనుభవించు తప్పులేదు, కాని వాటితో సంగభావం పెట్టుకోవద్దని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి.

Famous Posts:

Tags : devotional stories in telugu, devotional stories for kids, hindu devotional stories, devotional stories in english, devotional stories about faith, devotional stories, short devotional stories with morals, short devotional stories for youth, తెలుగు మంచి మాటలు

Comments