భగవంతుని భక్తుడు కోరాల్సినది ! Telugu Devotional Stories - Telugu Devotional Bhakthi

భగవంతుని భక్తుడు  కోరాల్సినది!

భగవంతుడు భక్తులపాలిటి కల్పవృక్షం, కామధేనువు. కోరిన వరాలిచ్చే కొంగుబంగారం. అలాంటి భగవంతుని అడగ వలసినవి అడక్కండా తుఛ్ఛమైన ప్రాపంచికమైన, అశాశ్వతమైన కోరికలు కోరు కోడం దురదృష్టం.ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా, మనస్పూర్తిగా ,నిష్కల్మష హృదయంతో చేయ గానే భగవంతుడు,' వీడునాకు నమస్కరించాడు, వీడుకోరుకునే కోరిక  తీర్చాలి ' అని నిశ్చయమై పోతాట్ట ఆయన. అంతదయాసాగరుడు, కరుణామయుడు. అలాంటిపరమేశ్వరుని మనం ఏమికోరు కోవాలో, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెల్సుకోవాలి.

Also Readఇంటి ముందు దిష్టికోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి?

పూర్వకాలం అంటే సుమారుగా వంద, వందా యాభై  ఏళ్లనాటి విషయం.ఆ కాలంలో మానవులకు ప్రయాణ సాధనాలేమీ ఉండేవికావు. డబ్బున్నవారు పురుషులు గుఱ్ఱాలమీద  స్వారీచేస్తూ, మహిళ లైతే  గుఱ్ఱ బ్బగ్గీల్లో  ప్రయాణం చేసేవారు. మధ్యతరగతివారు ఒంటెద్దు బండిలోనో, రెండెద్దుల బండిలోనో, గూడ బండ్లలోనో ప్రయాణించేవారు. సాధారణ మానవు లంతా కాలినడకన వెళ్లేవారు.ఆరోజుల్లో తమ తమ బాధ్యతలన్నీ తీర్చుకుని కాశీప్రయాణం పెట్టుకునేవారు. కాశీకెళ్ళితే కాటి కెళ్ళినట్లే అనేసామెత వచ్చింది. కాశీకెళ్ళిన వారు ఇహ తిరిగి రావడం ఉండదని భావన. ఎందుకంటే కాలినడకన ప్రయాణం దూరాభారం కనుక మధ్యలో అనారోగ్యమో, దొంగల తాకిడో, ఏదో ప్రతికూల పరిస్థితో వస్తే ఇహ తిరిగి రావడం జరిగేది కాదు.

అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ,ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలెట్టాడు. ఉదయాన్నే బయల్దేరి మధ్యాహ్నం వరకూ ప్రయాణం సాగించాడు.తెచ్చుకున్న ఉదకం ఐపోయింది, దాహం వేస్తున్నది. చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు. ఎండవేడి ఎక్కువగా ఉంది. అతడికి ఆసమయంలో అతడి అదృష్టమాని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపిం చింది . హాయిగా దానిక్రింద విశ్రమించాడు. దాహం భరించలేక అతడు 'ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బావుంటుంది '  అని అను కుంటూ  కళ్ళుమూసుకుని ఆలోచిస్తూ కొద్దిక్షణాల య్యాక కళ్ళుతెరిచాట్ట. 

 అక్కడ అతడికి తళతళా మెరుస్తున్న ఒక రాగి మరచెంబులో కనిపించింది. వెంటనే దానిమూత తీసి చూడగా స్వఛ్ఛమైన చల్లని నీరు నిండుగా దాన్లో ఉంది . హాయిగా త్రాగాడు,ముఖప్రక్షాలనం చేసుకుని సేద తీరాడు.దాహంతీరి, అలసట తీరాక, అప్పుడు గుర్తుకువచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు. చెట్టు మానుకు అనుకుని కళ్ళు మూసుకుని విశ్రాతిగా కొద్దొసమయం ఉండి, ఇహ ఆకలి భరించలేక , 'ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బావుంటుందీ!' అనుకున్నాట్ట. కొద్ది సేపటికి కళ్ళుతెరచి చూడగానే అక్కడ ఒక భోజనం పీటమీద విశాలమైన పచ్చని అరటాకులో వివిధ రకాలైన భోజన పదార్ధాలు, తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండటం చూసి, 'ఆహా! ఎవరో పుణ్యా త్ములు నా ఆకలి గ్రహించి ఆహారంఉంచిపోయారు 'అని భావించి హాయిగా కడుపారాఅన్నీతిన్నాడు. ‘అన్నదాతా సుఖీ భవ ' అనికూడా చెప్పుకున్నాడు. కమ్మని భోజనం , తీపివంట కాలతో సహా కడుపునిండా తినగనే అతడికి ఆయాసం  వచ్చింది.

కొద్దిసేపు విశ్రమించి ఆతర్వాత ప్రయాణం సాగించవచ్చు, ఐతే ఇక్కడ పవ్వళించను ఏమీ లేవే! ఒక్క మంచి మంచం మెత్తని పరుపూ తలగడతో సహా ఉంటే ఎంత హాయిగా నిద్రించవచ్చోఅనుకున్నాట్ట. వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం పరుపూ వచ్చేశాయి. దాంతో మహదా నందంగా అక్కడ పడుకున్నాడు. ' 'అబ్బా! ఉదయం నుంచీ కనీసం ఆరుగంటలు , సుమారుగా ఇరవై మైళ్ళు నడిచాను, కాళ్ళు పీకుతున్నాయి, ఎవరైనా వచ్చి నాభార్య పిసికినట్లు కాళ్ళు వత్తితే ఎంత బావుంటుందో కదా! హాయిగానిద్రించి కాళ్ళనొప్పులు పోగొట్టుకోవచ్చు.' అనుకున్నాట్ట. 

వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్లవైపుకూర్చుని కాళ్ళు మెల్లిగా వత్తసాగింది. కళ్ళు తెరచిచూసి 'ఇదేంటీ! నాభార్య ఇక్కడికి ఎలా వచ్చిందీ!  ఇదేం బ్రహ్మ రాక్షసి కాదుకదా!  నా గొంతునులిమి చంపేయదు కదా!' అనుకున్నాట్ట. వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసిగా మారి అతడి గొంతు నులిమి చంపేసిందిట. అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం. ఏమికోరితే అదంతా ఇచ్చేస్తుంది. మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అనవసరమైన, వ్యర్ధమైన కోరికలు కోరుకుంటూ , ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం. మన జీవితాలు, మనశ్వాసలూ వృధా పరచు కుంటూ దుర్వినియోగము చేసుకుంటూ,ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాం. దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్నా ఆయన్ని ఏమి కోరాలో మనకు తెలీడం లేదు.

దీనికో ఉదాహరణ.

పూర్వం ఒక మహారాజుకు నలుగురు భార్య లుండేవారుట, త్రిగుణాలవంటి ముగ్గురు భార్యలతోనే దశరధుడు మహా వీరుడయ్యీ పుత్రశోకంతో అసువులుబాశాడు, ఇహ నలుగురు భార్యల ఈ మహా రాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన సముద్రానికి ఆవల , దూరతీరాన ఉన్న ఒకరాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్ళాల్సి వచ్చిందిట. సుమారుగా మూడు మాసాలు రాజ్యాన్నీ, ప్రియమైన నలుగురు భార్యలనూ వదలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఊంది పాపం. బయల్దేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ  అప్పగించి, పట్టపు రాణిని రాజ్య వ్యవహారాలు చూసు కోమని చెప్పాడు. 

నలుగురు భార్యలనూ వారివారి కోరికలు తెల్సుకుందామనీ వచ్చేప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చనీ భావించి , ముందుగా ముద్దుల నాల్గో భార్య దగ్గర కెళ్లాట్ట." ప్రియా ! నేను కొద్దిమాసాలు నీకు దూరమవుతున్నాను కదా! నీకు ఆదేశం నుంచీ ఏమి కావాలో చెప్పు, నీవు కోరినవి తెస్తాను" అన్నాట్ట. దానికామె " మహారాజా! అక్కడ ఏమేమి  కొత్త వస్తువులు లభ్యమవుతాయి?"అని అడిగిందిట. దానికి మహారాజు" అక్కడ బంగారు గనులున్నట్లు విన్నాను. బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు" అన్నాట్ట.  వెంటనే ఆ నాలుగవ భార్య "ఐతే ప్రభూ నాకు ఏడు వారాల కొత్త నగలు, నాణ్యమైనవీ, కొత్త నమూనాలో అందమైనవీ తెండి" అని కోరిందిట. సరే అనిచెప్పి, మహారాజు రెండవ భార్య భార్య దగ్గరకెళ్ళి "రాణీ! మీకు విదేశాలనుండీ ఏమి కావాలి? "అని అడిగాట్ట. 

ఆమె "ప్రభూ! అక్కడ విరివిగా మనదేశంలో కంటే భిన్నంగా ఉండేవి ఏముంటాయి?"అని అడిగిందిట. దానికి మహారాజు, తెలివైనవాడు కనుక ఈమెకూ బంగారం గురించీ చెప్తే మళ్ళా పేచీలు వస్తాయని భావించి," రాణీ! అక్కడ మంచి పత్త్రి పండుతుందనీ,నాణ్యమైన నేత నేసేవారున్నారనీ విన్నాం. " అనగానే ఆమె," ప్రభూ! నాకు వింతవింత రంగుల మెత్తని, నాణ్యమైన చీరలు తెండి. మన రాజ్యంలో ఎవ్వరూ అలాంటివి చూసికూడా ఉండకూడదు" అని కోరిందిట. మహారాజు "అలాగే రాణీ!",అనిచెప్పి, ముచ్చటైన మూడో భార్య వద్దకెళ్ళి ,ఆమెనూ 'ఏమికావాలని" అడిగాట్ట. దానికామె ,మనస్సులో 'నేను ముదుసలినై పోతున్నందున , నామేని ఛాయ తగ్గుతున్నందున మహారాజు మూడో, నాలుగో రాణుల వద్దకే ఎక్కువగా వెళుతున్నట్లున్నారు. అందుకని నా అందం పెరిగేలా , నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని'  అనుకుని , " మహారాజా! ఇక్కడ లభించనివీ, అక్కడ మాత్రమే లభించేవీ ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా!"అని అడిగిందిట. 

దానికి తెలివైనమహారాజు, వారిద్దరికీ చెప్పినవి కాక "ఆ దేశంలో చక్కని అరణ్యాలున్నాయనీ, అక్కడ మంచి సువాసనా భరితమైన వనమూలికలు లభిస్తాయనీ, అందాన్ని పెంచేవీ, శరీరపటుత్వాన్ని తగ్గకుండా చేసేవీ ఉన్నాయని విన్నాం రాణీ!" అన్నాట్ట.  వెంటనే రెండో భార్య "ప్రభూ! ఐతే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పటుత్వాన్ని తగ్గించ కుండా మరియు అందాన్ని పెంచేవీ సువాసనా భరితమైనవీ దండిగా తెండి" అందిట. దానికి అంగీకరించి మహారాజు "అలాగే రాణీ! !తప్పక తెస్తాను " అనిచెప్పాట్ట.

మొదటి భార్య, పట్టపురాణీ ఐన ప్రధమకళత్రం వద్దకెళ్ళి "దేవీ! విదేశాలనుంచీ నీకేం కావాలి? మూడు మాసాలు రాజ్యాన్నీ,మిమ్మూవదలి వెళుతున్ననుకదా! మీకోర్కె చెప్తే మీకవి ఎంత కష్ట మైనవైనాసరే తెప్పించి తెస్తాను " అన్నాట. దానికా పట్టపు రాణి"మహాప్రభూ! మీరే నాసర్వస్వమని భావిస్తున్నాను. అది మీకూ తెల్సుకదా! మీరు సుఖంగా,ఆరోగ్యంగా క్షేమంగా రండి, నాకదేచాలు. మరే కోరికలూ నాకు లేవు. మీరు శుభంగా తిరిగి రావటమే నా కోర్కె" అని చెప్పిందిట, మహారాజు ప్రయాణమై వెళ్ళాడు.

మూడు మాసాలు గడచిపోయాయి. రాణులంతా వారు వారు కోరిన వస్తువులకోసం మహా రాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందజేస్తారా!' అని ఎదురు చూడసాగారు. ఒక శుభ ఘడియన మహారాజు రాజ్యానికి వచ్చారు . ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిషీ లు చెక్కిన దంతపు  పెట్టెను నాల్గవభార్య కు పంపారుట. ఆమెదాన్ని తెరచి చూసుకుంది. మహా అధ్బుత మైన ఏడువారాల నగలు కళ్ళు మిరుమిట్లు గొల్పు తున్నాయి. అవన్నీ తీసుకుని ఒక్కో వారం నగలూ అలంకరించుకుని అద్దం ముందు నిల్చుని తన  అందాన్నీ, అవి లభించిన తన  అదృష్టాన్నీ తనను తానే పొగుడుకుంటూ, చూసుకుంటూ  ముచ్చటపడి,మురిసిపోసాగింది.  

మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను మూడవ రాణి అంతఃపురానికి పంపారు. అది చూడగానే ఆమె మహదానందంగా మురిసిపోయి, తెరచి చూసి, దానిలోని మహా నాణ్యమైన, అందమైన రంగు రంగుల చీరలు, వాటి సరిగ అంచులూ, సొగసులూ, పల్లూలూ, చూసుకుని క్షణాని కొకటి మార్చు కుంటూ మురిసిపోసాగింది. ఇహ మహారాజు మూడవ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపారు.అదిచూడగానే ఆమె మనస్సు ఆహ్లాదం తో నిండిపోయి, పొంగిపోయింది.దాన్ని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందు లేసింది.దానిలోని వనమూలికలూ, సుగంధ మూలికలూ ఆమె అంతఃపురాన్నంతా సుగంధ భరితం చేశాయి.మీదు మిక్కిలి సంతసంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లిఖించి ఉన్న తాటాకు పత్రాలు పఠిస్తూ ఒక్కోటీ వాడుతూ తనశరీరంలో వచ్చే మార్పులు దర్పణంలో చూసుకుంటూ వింత పోసాగింది. 

Also Readఇవి చదివితే మనకు మహిమలు వస్తాయి - లలితా పారాయణ మహిమ

 మహారాజు పట్టపు రాణి అంతఃపురానికి వెళ్ళి,హాయిగా ఆమె చేసే సేవలను ఆనందగా అనుభవిస్తూ సుఖించసాగాడు. కొద్ది నెలలు గడిచాయి.మహారాజు తమ అంతఃపురాలకేసి రాకపోడం మిగతా ముగ్గురు రాణులూ గమనించి, పట్టపురాణి మందిరానికి ఒక రోజున కలసి కట్టుగా ముగ్గురూ వచ్చారు "ఏమమ్మా! మహారాజు మాకూ భర్తే ! నీవు ఇలా ఆయన్ని నీ అంతః పురంలోనే కట్టి పడేసుకోడం సిగ్గుచేటు "అంటూ తగవులాడ సాగారు. దానికి మహారాజు చిఱునవ్వుతో" ప్రియ రాణులారా! ఆగండాగండి. మీరు కోరినవి మీకిచ్చాను. ఆమెకోరినది ఆమెకిచ్చాను. దీన్లో ఆమె తప్పేంలేదు. మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యంకాదు "అన్నాడుట.

దానికి ఆముగ్గురు రాణులూ " మహారాజా! ఏంటి ఆమెకోరిందీ! మేముకోరందీనీ?"అని ప్రశ్నించారుట. దానికి ఆ మహారాజు " రాణులారా! మీరు ముగ్గురూ ! నగలూ, చీరలూ, మూలికలూ కోరారు. ఆమె నన్నే కోరింది.  నేను సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి  రావాలని కోరుకున్నది. ఆమె కోరినట్లే  నేను ఆమె మందిరానికి వచ్చాను. మీరు కోరినవి మీకు పంపాను. ఆమెకోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను. దీన్లో ఆమె తప్పేముందీ!" అన్నాట్ట. దానికి ముగ్గురు  రాణులూ , తమ తప్పిదం తెల్సుకుని తలలు వాల్చుకుని వెళ్లారుట. ఇదండీ మనం చేసే తప్పు, కోరరానివన్నీ కోరుతాం. అసలు కోరవల్సిన భగవత్సన్నిధిని మాత్రం కోరం.

అందుకే ఆయన  కల్పతరువులా, కామధేనువులా కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు, మనం కోరుతూనే ఉన్నాం.

ఏం కోరుతున్నాం?

 "కల్పవృక్షాన్ని కాఫీపొడి కోరుతున్నాం!.’ ఇదా మనం కోరాల్సింది. క్షణ భంగురమూ అశాశ్వతమూ ఐన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన మనస్సునే మనం తెల్సుకోలేక పోతున్నాం. జీవన సాఫల్యం మాత్రం మిగిలి పోతూనే ఉంది. జన్మ  రాహిత్యం మాత్రం మనం  కోరడం లేదు. కోరడం లేదు గనుక ఆయన ఇవ్వడం లేదు. ఇహ నైనా అటు వైపు మనస్సును మరలిద్దామా! కోరవలసినదానిని బగవంతుని కోరుకుందామా..

devotional stories in telugu pdf, devudu kathalu in telugu, real god stories in telugu, mythology stories in telugu, ghost stories in telugu, lord shiva stories in telugu, telugu stories, lord shiva story in telugu pdf, భగవంతుని భక్తుడు  కోరాల్సినది.

Comments