ఈ కథ చదవడం, వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం - Srichakra and shankaracharya - Shakti Sadhana - Madurai Meenakshi
ఈ కథ చదవడం, వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం, పూర్తిగా_చదవండి..
అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని ప్రతిష్టించిన మహాత్ములు ఆది శంకరులు ... ఈ కథ చదవడం, వినడం కొన్ని కోటిజన్మల పుణ్యఫలం, పూర్తిగా_చదవండి.
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం
పంచశత శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.
మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.
పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!
క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.
తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.
ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు.
"వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క" అని పాండ్యరాజు వేడుకున్నాడు.
ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు. పాండ్యరాజు హతాశుడైయ్యాడు.
దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు.
రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.
ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.
పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.
ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.
క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా.
ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !
అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి?
అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.
ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు.
ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!" ఆనుకుంది అమ్మవారు.
"ఎవరు నాయనా నీవు ? నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.
ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది.
"కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి" మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు".
" నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు.
"బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"
"కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.
పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు"
"మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను".
"అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.
ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది.
"తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"
"తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.
జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి, తన సంహారకార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది.
ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.
"ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి. చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీఇష్టము!" అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు.
ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.
నీ లలితాసహస్రనామంలోని కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.
సంఖ్యాశాస్త్రప్రకారము పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది.
ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి.
"విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.
పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది.
"గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.
ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది.
పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు.
వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది.
అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.
"ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు.
"తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు.
"నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.
"నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.
"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!" అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు.
దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు.
అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడుతల్లీ!"
44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి.
"అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".
"ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు.
"స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు.
ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి.
భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.
మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత.
పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.
అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు.
కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు. బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు.
అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలై ఉంటాడని భయబ్రాంతుడయ్యాడు.
రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు.
సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది.
ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి".
"నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.
మూలమ్: శ్రీలలితాసహస్రనామ_సర్వస్వం
అందరం భక్తితో "శ్రీ మాత్రే నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది చల్లని చూపుల చక్కని తల్లి మన మధుర మీనాక్షమ్మ...
Famous Posts:
madurai meenakshi and shankaracharya story, madurai meenakshi amman original photos, madurai meenakshi parrot, why meenakshi goddess is in green, meenakshi amman birth star, madurai meenakshi temple history in tamil, story of meenakshi sundareswarar marriage, madhurai meenakshi.
Comments
Post a Comment