నారదుడు ఎవరు? జన్మ రహస్యం ఏంటి? Who is Narad Muni according to Hindu mythology? Stories about Narada Muni

నారదుడు ఎవరు? జన్మరహస్యం ఏంటి?

వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ని ‘కలహ భోజనుడు’ అని పిలుస్తారు.

కానీ ఆయన గొప్పతనం, చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు, ఆయన ఏది చేసినా లోకహితార్థం, లోకరక్షణ కొరకే ...

పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. 

వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.

వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. 

‘నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే... గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. 

కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహా జ్ఞానులు, భక్తులు కాగలరు, కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు’ అని తన కథను చెప్పాడు.

నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. 

ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు...

బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. 

ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. " వారికి  సేవలు చేస్తుండ " మని యజమాని నారదుడికి పురమాయించాడు...

సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు, దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు...

మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు, ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి...

పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 

అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే  శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ...

ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. 

ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. 

అశరీరవాణి ’ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. 

నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు, ఆ తరవాత నీవు  బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. 

ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.

ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. ’మహతి’ అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం... 

ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. 

భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు, దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. 

అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. ‘భక్తి సూత్రాలు’ రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు.

ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి ‘నారదా’ మంచిమాట చెప్పావు.

ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. 

వీటిని చదివిన, విన్నవారు నీలాగే తరించిపోవాలి’ అని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంబించాడు...

Famous Posts:

narada maharshi in telugu, narada muni wife name, narada muni veena name in telugu, narad muni characteristics, narada maharshi images, narad muni story, ňárad muni temple, narada muni quotes, narada

Comments