కార్తీక పురాణం 13వ అధ్యాయం - కన్యాదన ఫలము | Karthika Puranam Day 13 in Telugu

కార్తీక పురాణం 13వ అధ్యాయం

కన్యాదన ఫలము

ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను సావధానంగా విను.

కార్తీక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారినికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణతాంబూలం, సంభావనలతో తృప్తి పరచినా ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలిగిపోతాయి. ఎన్ని దానధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా, వారి పితృదేవతలను కూడా తరింపచేసినవాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినమనెను.

సువీర చరిత్ర

ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి, భార్యతో కలసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కనులపండుగగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ, ఆ బాలిక పెరిగి పెండ్లి వయసుకు వచ్చింది.

ఒక రోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుడు కోరాడు. అందుకు ఆ రాజు 'ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నిచ్చి పెండ్లి చేస్తాను' అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలికమీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గూర్చి ఘోరతపస్సు చేసి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించి, రాజుకు ఆ ధన పాత్రని ఇచ్చి ఆ బాలికను పెండ్లి చేసుకుని తీసుకువెళ్ళి తన తల్లితండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉన్నాడు.

ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చనన్న ఆశతో ఎదురుచూడసాగాడు.

ఒకానొక రోజున ఒక సాధుపుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుడుని కలుసుకుని 'నువ్వెవ్వరిని. నిన్నుచూస్తుంటే రాజవంశస్తుడవలే ఉన్నావు? నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.'

సువీరుడు 'మహానుభావా నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రవులాక్రమించారు. భార్యతో కలసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకొన్నాను. దానితోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నాను అని చెప్పాను.'

అప్పుడు ఆ ముని 'ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడివైనా, ధర్మసూక్షమాలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయం మహా పాపాలలో ఒకటి. కన్యను విక్రయించివారు 'అసిపత్రవన'మను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్ధం ఏ వ్రతం చేస్తారో వారు నాశనం అయిపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసేవారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెండ్లాడినవారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవుటయే గాక అతడు మహా నరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుటయే కాకుండా, మొదట కన్యను అమ్మిన పాపం కూడా తొలిగిపోతుంది' అని రాజుకు హితవు చెప్పాడు.

అందుకారాజు చిరునవ్వు నవ్వి 'ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను, సిరిసంపదలతోనూ సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనమూ, బంగారం ఉన్నవారే ప్రస్తుతలోకంలో రాణింపగలరు. ముక్కూ, నోరు ముసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా?, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నేనడిగినంత ధనం ఎవరైతే నాకిస్తారో, వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను' అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకములో అసిపత్రమనే నరకభాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన సృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ సృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు.

అప్పుడు సృతకీర్తి 'నాకు తెలిసినంతవరకు దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేసి, ఇతరులకు ఉపకారమే చేశాను. మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది?' అనుకుని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి 'ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి' అని ప్రాధేయపడ్డాడు.

యమధర్మరాజు సృతకీర్తిని చూస్తూ 'సృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు. నువ్వు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశస్తుడు అయిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకొన్నవారి ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలువారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచజన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశస్తుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నతీ తీరాన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి, అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ధనంతో కన్యాదానం చేసినా, విధి విధానంగా ఆబోతునకు అచ్చువేసి వివాహం చేసినా కన్యాదాన ఫలం లభిస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసిరా. అలా చేయడం వల్ల నీ పితృగణం తరిస్తారు వెళ్ళిరమ్మని' యమధర్మరాజు పలికెను.

సృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి, కార్తీకమాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు.

కన్యాదనం వల్ల మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షబూని ఆచరించివాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.

త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణం సమాప్తం.

Famous Posts:

Tags : కార్తీక పురాణం, కార్తీక పురాణం 13వ అధ్యాయం, Karthika Puranam, Karthika Puranam Day 13 in Telugu, Karthikapuranam Story

Comments