కార్తీకమాసంలో దీపం దానం చేయడం వల్ల కలిగే ఫలితాలు | Deepa Danam in Karthika Masam

దీపదానం

సాయంకాలం ప్రదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ, మఠము లందునూ ఇవి పెట్టవలెను. 

అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః| 

యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః|| 

ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే. 

ఉల్కాదానం (దివిటీలు):- 

దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి.

లక్ష్మీపూజ:- 

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి. 

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు. 

విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి. 

అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే. 

'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత-' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసిచేయడం జ్ఞానంతో చేయడం దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ, సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నవని మనం తెలుసుకోవాలి.

Tags : దీపదానం, కార్తీక మాసం, Karthika Masam, Karthika Deepam, Karthika Deepadanam, Karthika Danalu, Karthika Masam Telegu

Comments