How to perform Chandi Pradakshina in Lord Shiva Temple? 30 వేల ఫలితాన్నిచ్చే ఒకే ఒక్క ప్రదక్షణం "చండ ప్రదక్షణం"

30 వేల ఫలితాన్నిచ్చే ఒకే ప్రదక్షిణం చండ ప్రదక్షిణం

శివాలయంలో ఉత్తమోత్తమమైన ప్రదక్షిణం 'చండ ప్రదక్షిణం'. శివునికి ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటకూడదు. అలా.. చేసి ఏ ప్రదక్షిణమైనా, ఒకటే లెక్క కిందకు వస్తుంది. అలా కాకుండా, 'చండ ప్రదక్షిణం' ఒక్కసారి చేసినా సరే, 30 వేల సార్లు ప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుంది. ఆ 'చండ ప్రదక్షిణం' ఎలా చేయాలో శైవాగమ గ్రంథాల్లో ఇలా చెప్పారు:

చండ స్థానే తు సంకల్ప్య ! వృషభా దౌ ప్రదక్షిణమ్ ||

వృషం చందం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం ॥

చందం చ సోమసూత్రం చ పునశ్చందం పునర్వృషం ॥

నవ ప్రదక్షిణోపేతం | యః కుర్యాచ్ఛ ప్రదక్షిణమ్ ॥

త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్ ॥

(శైవాగమే)

శివాలయంలో 'చండ ప్రదక్షిణ చేయాలంటే...

1. మొదట శివాలయంలోని చండీశ్వరుని వద్ద సంకల్పించి, ప్రదక్షిణ ప్రారంభించాలి. (శివాలయంలో శివునికి అభిషేకం చేసిన గర్భగుడిలో నుంచి బయటకు జలం ధారగా వచ్చే సోమసూత్రం దగ్గర సాధారణంగా చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఒకవేళ చండీశ్వరుడు లేకపోయినా, సోమసూత్ర స్థానాన్నే చండీశ్వర స్థానంగా గుర్తించాలి). అక్కడ మొదలు పెట్టి, సవ్యదిశలో ధ్వజస్తంభం వద్ద ఉండే వృషభం (నందీశ్వరుడి) వద్దకు రావాలి.

2. అక్కడ నుంచి సవ్యదిశలోనే చండీశ్వరుని వద్దకు వెళ్ళాలి.

3. అప్పుడిక చండీశ్వరుని వద్ద నుంచి వెనక్కి తిరిగి, అపసవ్య దిశలో ప్రదక్షిణ ప్రారంభించి, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరుండే వృషభం దగ్గరకు వెళ్ళాలి. 

4. వృషభం దగ్గర నుంచి అపసవ్యదిశలోనే చండీశ్వరుని దాకా పయనించాలి.

5. దాంతో, ఆలయాన్ని రెండు సార్లు చుట్టి వచ్చినట్లయింది. ఆ పైన మళ్ళీ మొదటిసారిలానే, సోమసూత్రం నుంచి సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తూ, ధ్వజస్తంభం దగ్గరున్న వృషభం వద్దకు వెళ్ళాలి.

6. వృషభం వద్ద నుంచి చండీశ్వరుని దాకా ప్రదక్షిణ చేయాలి.

7. అప్పుడిక మళ్ళీ చండీశ్వరుని దగ్గర నుంచి అపసవ్య దిశలో ప్రదక్షిణ ప్రారంభించి, మళ్ళీ ధ్వజస్తంభం వద్దనున్న వృషభం దగ్గరకు వెళ్ళాలి.

8. వృషభం వద్ద నుంచి అపసవ్యదిశలోనే ప్రదక్షిణ చేస్తూ, చండీశ్వరుని దాకా పయనించాలి.

9. అక్కడ చండీశ్వరుని దర్శించి, నమస్కరించి, ఆయన దగ్గర నుంచి సవ్యదిశలో ధ్వజస్తంభం వద్దనున్న వృషభం దగ్గరకు రావాలి.

ఇలా ఈ తొమ్మిది పనులూ చేస్తే, అప్పుడది ఒక 'చండ ప్రదక్షిణం' కింద లెక్క. (మరింత వివరంగా అర్థం కావడానికి పక్కన ఇచ్చిన రేఖా చిత్రం చూడండి) ఒక చండ ప్రదక్షిణంలో మొత్తం 9 ప్రదక్షిణలు ఇమిడి ఉన్నాయి. ఇలా ఒక 'చండ ప్రదక్షిణం' చేస్తే, శివుడికి 30 వేల ప్రదక్షిణలు చేసినంత పుణ్యం దక్కుతుంది.

ఇలా ప్రదక్షిణం చేయడం పూర్తయ్యాక, ధ్వజస్తంభం ఎడమ పక్క నుంచి శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించాలి.

నందికి ఏ పక్క నుంచి గుడి లోపలకు వెళతామో, ఆ పక్క నుంచి మాత్రమే వెనుకకు రావాలి. అంతేకానీ, శివలింగం, నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. అలా వస్తే, పుణ్యం రాకపోగా, పూర్వజన్మ పుణ్యం కూడా పోతుంది.

శివాలయంలో నందీశ్వరుణ్ణి ప్రార్థించిన తరువాతే స్వామి వారిని దర్శించడానికి వెళ్ళాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు.

Tags : చండీ ప్రదక్షిణ, Chandi Pradakshina, Chandi Pradakshina, Pradakshinam, Chanda Pradakshinam Telugu, Chanda pradakshina

Comments