వాస్తు పురుష స్ధితిని అనుసరించి సింహాద్వార నిర్ణయం..
వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం కృత్తికా నక్షత్రం నందు వ్యతీపాత యోగం నడుచుచుండగా భద్ర కరణముల యొక్క మధ్యభాగమున వాస్తు పురుషుని ఉద్భవం జరిగింది.
స్దిర వాస్తు పురుషుడు :- వాస్తు పురుషుడు అధోముఖంగా శయనిస్తూ ఈశాన్యంలో తల ఉంచి (వాస్తు పురుషుని శిరస్సు) పాదాలు నైరుతి భాగంలో ఉంటాయి. వాయువ్య, ఆగ్నేయ దిక్కులలో భుజాలు, మధ్యభాగంలో వక్ష స్ధలం, హస్తాలు ఉంటాయి. ఈ వాస్తు పురుషున్ని స్ధిర వాస్తు పురుషుడు అంటారు.
చర వాస్తు పురుషుడు :- స్దిర వాస్తు పురుషుడే సూర్య సంచారాన్ని బట్టి చర వాస్తు పురుషునిగా సంచరిస్తాడు. ఈశాన్య దిక్కు నుండి తూర్పుకి సంచరిస్తాడు. వాస్తుపురుషుని ఎడమభాగం అంటే ఎడమవైపుగా తిరిగి శయనించి సూర్యుడున్న రాశిలో పాదాలు ఉంచి దానికి సప్తమరాశిలో తల ఉంచి నాలుగు దిక్కులకు పరిభ్రమిస్తాడు. కన్య,తుల, వృశ్చిక రాశులలో సంచరించేటప్పుడు తూర్పు శిరస్కుడుగాను, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో సంచరిస్తాడు.
తూర్పు శిరస్కుడు :- భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో వాస్తు పురుషుడు తూర్పున శిరస్సు, పడమర పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. కాబట్టి వాస్తుపురుషుని పూర్ణదృష్టి దక్షిణ దిశ యందు, పాదదృష్టి పడమర దిక్కున పడును. అందుచే భాద్రపద, ఆశ్వయుజ, కార్తీకమాసాలలో దక్షిణ, పడమర సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.
దక్షిణ శిరస్కుడు :- మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో వాస్తుపురుషుడు దక్షిణదిశలో శిరస్సును, ఉత్తరాన పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి పడమర దిశలోను, పాదదృష్టి ఉత్తర దిశ గాను ప్రసరిస్తుంది. కాబట్టి మార్గశిర, పుష్య, మాఘమాసాలలో పడమర, ఉత్తర సింహద్వారం కల ఇల్లు కట్టటం మంచిది.
పశ్చిమ శిరస్కుడు :- ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో వాస్తుపురుషుడు పడమర దిశలో శిరస్సును, తూర్పు దిశలో పాదాలు ఉంచి ఎడమపక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి ఉత్తర దిక్కునందు, పాదదృష్టి తూర్పుదిక్కునందు ప్రసరిస్తుంది. కాబట్టి ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో ఉత్తర, తూర్పు సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.
ఉత్తర శిరస్కుడు :- జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలో వాస్తు పురుషుడు ఉత్తర దిశయందు శిరస్సును, దక్షిణ దిశయందు పాదాలను ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణ దృష్టి తూర్పుదిశలోను, పాదదృష్టి దక్షిణ దిశలోను ప్రసరిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలోతూర్పు, దక్షిణ సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.
Famous Posts:
Tags : వాస్తు, vastu, top 10 vastu tips for home, vastu tips, vastu for home, vastu tips for home entrance, vastu for home, vastu tips telugu
Comments
Post a Comment