కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? What should be done on which Tithi day in the month of Kartika?
శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.
మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.
న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః
కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శానకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.
కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.
కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.
ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.
చవితి: కార్తీక శుద్ధ చవితి: నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రగ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది.
అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.
నవమి: నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి:ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.
త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.
చతుర్దశి: పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.
కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.
కార్తీక బహుళ పాడ్యమి: ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.
విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.
తదియ: పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.
చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.
షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.
సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.
అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి: ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణు వుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయి.
ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.
త్రయోదశి:నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.
చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.
అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.
ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.
గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమా రాధనలో వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోంది. వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారు. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, చండాలురు, సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.
కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు, కాదు, ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.
తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.
ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం జాజి, అవి సెపువ్వు, గరిక. దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.
Famous Posts:
Tags: కార్తీక మాసం, తిథి, karthika masam, karthika masam thidhi, karthika masam danalu, karthika masam telugu, karthika purnima
Comments
Post a Comment